ఇరాన్-అమెరికా యుద్ధానికి తెర?.. పాక్ ద్వారా కొత్త శాంతి ప్రతిపాదన!

  • పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన
  • ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా పాకిస్థాన్ కీలక చర్చలు
  • సమయం మించిపోతోందంటూ ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్
  • అమెరికా షరతులు కఠినంగా ఉన్నాయని ఇరాన్ అసంతృప్తి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాతో శాంతి చర్చల కోసం ఇరాన్ ఒక సవరించిన ప్రతిపాదనను పంపింది. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ ద్వారా ఈ ప్రతిపాదనను వాషింగ్టన్‌కు చేరవేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉంది.

చర్చల్లో ప్రధాన మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ విషయాన్ని నివేదించింది. "మనకు ఎక్కువ సమయం లేదు" అని ఆ వర్గాలు వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. శాంతి చర్చలు స్తంభించిన తరుణంలో ఇరుపక్షాలు తమ లక్ష్యాలను పదేపదే మార్చుకుంటున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.

మరోవైపు అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనకు తాము స్పందించామని ఇరాన్ నేడు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతోందని తెలిపింది. అయితే, అమెరికా డిమాండ్లు మితిమీరి ఉన్నాయని ఇరాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించకపోవడం, ఇరాన్ కేవలం ఒకే ఒక్క అణు కేంద్రాన్ని కలిగి ఉండాలనేవి అమెరికా ప్రధాన డిమాండ్లలో ఉన్నాయని ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ స్పందించారు. "మా ఆందోళనలను అమెరికా దృష్టికి తీసుకెళ్లాం. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి" అని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రస్తుతానికి యుద్ధాన్ని ముగించడంపైనే తమ పూర్తి దృష్టి ఉందని, ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సంకేతాలిచ్చారు.

ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ఈ చర్చలు కొనసాగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న‌ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "ఇరాన్‌కు సమయం మించిపోతోంది. వారు వేగంగా కదలాలి, లేదంటే ఏమీ మిగలదు. సమయం చాలా కీలకం!" అని తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అలాగే, ఫార్చ్యూన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. "ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ఆరాటపడుతోంది. కానీ, వారు ఒక ఒప్పందం చేసుకుని, ఆ తర్వాత దానికి ఏమాత్రం సంబంధం లేని పత్రాలను పంపిస్తారు" అని అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసే వరకు వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం కోసం వేచి ఉండాల్సి రావచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయత్నాలు ఫలించి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయో లేదో వేచి చూడాలి.

Iran
Iran America war
US Iran peace talks
Pakistan
Donald Trump
West Asia conflict
Iran nuclear program
Ismail Baghaei
Fars News Agency
Ceasefire

More Telugu News